ఇక చొరబాటుదారులను తరిమికొట్టే సమయం వచ్చింది: అమిత్ షా

దేశంలో నక్సలిజాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా అణిచివేసిందని, ఇప్పుడు చొరబాటుదారులను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు బాంబులు, తూటాలకు ఓట్లతో జవాబు ఇస్తారని అన్నారు.

మమతా బెనర్జీని గద్దె దించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. రాబోయే ప్రభుత్వం బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు తృణమూల్ కాంగ్రెస్ గూండాలు అరాచకాలకు స్వస్తి చెప్పి ఇళ్లలోనే ఉండిపోవాలని లేదంటే తమ ప్రభుత్వం వచ్చాక వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బెంగాల్ సహా అన్ని రాష్ట్రాల్లో ఉన్న చొరబాటుదారులను వెనక్కి పంపిస్తామని అమిత్ షా అన్నారు.

మమతా బెనర్జీ ప్రభుత్వం గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతిచ్చారని, కానీ నాటి కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం, చొరబాట్లపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పైగా ఉగ్రవాదులకు బిర్యానీతో విందు ఇచ్చిందని ధ్వజమెత్తారు. పహల్గామ్ ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని, పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ తీసిందని అన్నారు.

రాత్రి సమయాల్లో మహిళలు ఒంటరిగా తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందని గతంలో మమతా బెనర్జీ అన్నారని, అలాంటి మాటలు ఆమె పదవికి సిగ్గుచేటు అన్నారు. ఆర్జీకర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్ధరాత్రి కూడా మహిళలు ధైర్యంగా తిరిగే వాతావరణాన్ని తాము బెంగాల్‌లో సృష్టిస్తామని అమిత్ షా తెలిపారు.

Amit Shah
West Bengal elections
Mamata Banerjee
BJP
infiltrators
Naxalism
Raniganj
Indian politics

More Telugu News